గుంటూరు శేషేంద్ర శర్మను
మళ్ళీ తెలుసుకుందాం
మే 30, 2010
శేషేంద్ర మూడవ వర్ధంతి స్మారకోపన్యాసం
- డా. కాత్యాయనీ విద్మహే
గయలో ఁ గాశి ఁ ప్రయాగ శ్రీగిరిని గంగాద్వార నీలాచలో
జ్జయినీ ద్వారకలందయోధ్య మధురన్ సంస్తుత్య పుణ్యస్థలా
గ్రియతన్ వెండియు మించు నైమిశ కురుక్షేత్రాదులం దర్పణ
క్రియచే నా పితనమ్ముఁడెఱ్ఱన యొనర్చెన్ దండ్రికాహ్లాదమున్.
* * *
ఏనుంబితృపూజన నా
చే నైనట్లెద్దిఁయైనఁ జేయఁగవలయున్
గానఁ, గృతి యిచ్చిమేదిని
పై నిలుపుదు నతని కీర్తి Cబరమేశుకృపన్||
(ప్రభావతీప్రద్యుమ్నం, పద్యాలు 8,9)
అని నిశ్చయించుకొని సూరన తన రచనను తండ్రికి అంకితమిచ్చాడు. పితృపూజ తర్పణ క్రియారూపమే కానక్కరలేదు అన్న సూరన మార్గంలో సాత్యకి గారు ఎంచుకొన్న పితృపూజనమార్గం తండ్రి గారయిన గుంటూరు శేషేంద్ర శర్మగారి వర్థంతిని సాహిత్యసభగా నిర్వహించటం. నాకూ సాత్యకి గారికి సమానధర్మం అది. 1990లో మానాన్న కేతవరపు రామకోటిశాస్త్రి మరణించినప్పటి నుండి ప్రతియేడూ అక్టోబరు 28న ఆయన రచననొకదానిని అచ్చువేయటం, ఆ పుస్తక పరిచయ సభగా సంస్మరణ జరపటం నేను చేస్తున్నపని. అలాంటిపనే తన తండ్రిగారిపట్ల నిర్వహిస్తున్న సాత్యకి గారు ఈసారి సభలో శేషేంద్ర శర్మగారి గురించి మాట్లాడమని నన్నడిగితే ఒప్పుకొన్న ప్రథమకారణం అదే. రెండవ కారణం మా నాన్నా శేషేంద్రశర్మ గారూ మిత్రులు కావటం, మూడవ కారణం ఒక సాహిత్య విద్యార్థిగా శేషేంద్రశర్మ గారిని మొత్తంగా ఒకసారి చదవటానికి తెలుసు కోవటానికి అవకాశంగా ఈ సందర్భాన్ని ఉపయోగించుకొనాలనుకొనటం. ఆరకంగా సాత్యకిగారు, నేనూ ఒక సాహిత్య సంప్రదాయ వారసత్వంగా పింగళిసూరన మార్గంలో మాకు తెలియకుండానే ప్రారంభించిన నడకకు మామా తండ్రుల స్నేహవారసత్వం కూడా అదనపు విలువగా సమకూరిందనిభావిస్తున్నాను
నేను శేషేంద్రగారిని బి.ఎ. చదువుతున్నప్పుడు మొదటి సారి తెలుసుకొన్నాను. మాకప్పుడు ద్వితీయభాష తెలుగులో వచనసాహిత్య విభాగంలో శేషేంద్రశర్మగారి 'సాహిత్యకౌముది' పాఠ్యాంశం. శ్రీనాధుని పద్యశిల్ప సౌందర్యాన్ని నిరూపిస్తూ పద్యాలకు పద్యాలు ఉటంకిస్తూ శేషేంద్రగారు వ్రాసిన వ్యాసం ఆశ్చర్యకరంగా, ఆకర్షక కేంద్రంగా వుండింది. వ్యాసానికి వ్యాసం మాకప్పుడు ధారణలో వుండేది. నా బి.ఎ పూర్తయ్యేటప్పటికి మండే సూర్యుడు (1974) నాదేశం- నాప్రజలు కావ్యాలు వ్రాసి సాహిత్యరంగంలో గొప్ప చర్చకు కారణమైనాడు ఆయన. 1977లో ఎమ్మే అయిపోయాక కానీ నాకవి చదివే అవకాశంరాలేదు. నేను ప్రధానంగా వచనరచనా పాఠకురాలిని, శేషేంద్రగారు వ్రాసిన 'కామోత్సవ్' నవలను మాత్రం ఆంధ్రజ్యోతిలో సీరియల్గా వస్తుండగానే ఆసక్తిగా చదివాను. ఈ వస్తువేమిటి? ఇలా వ్రాసారేమిటి? ఇందువల్ల ఆశించిన ప్రయోజనమేమిటి? అని కొంత ఆందోళన పడ్డమాట వాస్తవం. సాత్యకి గారే ఎక్కడో నవల శేషేంద్రగారు వ్రాసింది కాదని మరెవరిచేతనో వ్రాయించి శేషేంద్ర పేరున అచ్చేసిన నవల అని చెప్పారు. అలా ఎందుకు జరిగిందో మనకు తెలియదు. అయితే శేషేంద్ర మాత్రం ఆ నవల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిన సందర్భంలో కూడా అది తనది కాదనలేదు. పైగా అన్ని నీతులు, అన్ని చట్టాలు సాధారణ ప్రజలకేగాని ఉన్నతవర్గాలకి వర్తించవు. ఉన్నత వర్గాల్లో వున్న అస్తవ్యస్త సంబంధాలు, సాంఘిక, నైతిక బాధ్యత లేవీ ఆవర్గానికి లేకపోవటం, ఆవర్గాలే పాలకవర్గంగా వుండటం మొదలైన అంశాలను చిత్రించే ఏ ఉద్దేశంతో తానా నవల వ్రాశాడో దానిని తెలుగు సాహిత్య పాఠకులు అర్థం చేసుకోలేకపోయారని వాపోయారు. (సాహిత్యదర్శిని. పు 239) రచయిత చెప్పిన ఈ ఉద్దేశాన్ని ఆ రచన ఎంతవరకు ఆవిష్కరించగలిగిందో ఇప్పుడు మళ్ళీ ఆనవల చదివితే కానీ నిర్ధారించలేము. అదలా వుంచుదాం.
శేషేంద్ర శర్మను సాహిత్య ప్రపంచంలో స్థిరీకరించినవి ప్రధానంగా ఆయన కవిత్వం, విమర్శ. అయినా ఆయన వ్రాసిన కథలు, ఒకే ఒక నాటకం కూడా మనం ప్రస్తావించుకొనవలసినవే. కథలు ‘విహ్వల' అన్న సంపుటిగా 1968లో వచ్చింది. ఆ సంవత్సరమే 'మబ్బుల్లో దర్బార్' అనే నాటకం కూడా అచ్చయింది. 'విహ్వలతో కలుపుకొని శేషేంద్ర వ్రాసిన కథలు ఐదు. ఇతివృత్తాలు వేరైనా కధలన్నిటి అంతస్సూత్రం జీవితవిషాదం. చిన్న చిన్న సరదాలను సంతోషాలను కూడా పొందటానికి అవరోధమయ్యే పేదరికం, పేదరికంలోనైనా పెన్నిధి వలె వుండే కౌటుంబిక బాంధవ్యాలను సైతం దక్కనీయకుండా ఆత్మీయులను ప్రమాదపు అంచులకు నెట్టివేసే వృత్తి జీవన విధానాలు, యుద్ధాలు, ఇవన్నీ జీవితంలో దుఃఖానికి ఎలా కారణమవుతున్నాయో చెప్పే కథలు విహ్వల, రంగుల చేప, ఎగిరిపోయిన హంస. వీటిలో విహ్వల కథ పిల్లల మనస్తత్వంలోని స్వచ్ఛతను నిబిడ బంధంతో చిత్రించింది. ఆర్థిక అసమానతలకు అతీతంగా వికసించగల మానవీయ సంస్పందనను ఆవిష్కరించింది. స్త్రీల జీవితాన్ని దుఃఖ భాజనం చేసే పురుష పశు ప్రవృత్తి హరిణ కథాంశమైంది. వయో తార తమ్యాలతో నిమిత్తం లేకుండా జనించే ప్రేమకాలాంతరంలో జీవిత వాస్తవాలను కంటి ముందు నిలబెట్టినప్పుడు కల్లోలానికి లోనయ్యే అంతరంగాలను ఆవిష్కరించింది హిరణ్మయి కథ. మొత్తానికి శేషేంద్ర కథలు చదివించే లక్షణం కలవి. మనో వైచిత్రీ చిత్రణ ప్రధానమైనవి.
'మబ్బుల్లో దర్బారు' 1954లో వ్రాయబడి ఆంధ్రప్రభలో ||అచ్చయి 1968లో ప్రథమ ముద్రణ పొందిన నాటకం. అయినా ఆనాటకంలో చర్చించబడిన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ////సంకు అధికారకాంక్షకు అది ఒక వ్యాఖ్యానంగా, విమర్శగా వుండటం వలన ఈనాటి సమాజానికి, స్వార్థపూరిత మానవమనస్తత్వానికి, కనబడుతుంది. భూమండల ఆక్రమణతో తృప్తిపడని మానవ మహాచక్రవర్తుల దురాశకు, దురహంకారానికి అధికార దర్పానికి శాస్త్రాలు, ప్రజాస్వామ్యం, కవులు-పురోహిత వర్గం, రాజకీయాలు దాసోహమైన ఒక దుఃస్థితిని దాని దుష్పరిణామాలను వస్తువుగా చేసి వ్రాసిన నాటకం ఇది. మానవుడి దురాశ కారణంగా విధ్వంసానికి గురవుతున్న పంచభూతాలు . అంటే ప్రకృతి పర్యావరణ హింసను తట్టుకోలేక మానవుడ్ని అంత మొందించాలనుకొని కూడా మానవుల్లోని మారే లక్షణం మీద ఒక ఆరిపోని ఆశతో - బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలనుకొనటంతో, అందుకొరకై చర్చలకు అతనిని పిలవనంపటానికి 'వేదాంతి'ని రాయబారిగా పంపటంతో ఈ నాటకం ప్రారంభమవుతుంది. వేదాంతి అంటే లౌకిక జీవిత మోహాలు, వ్యామోహాలు లేనివాడు. వేదాంతిని రాజ్యాధికారం పక్షాన నిలబడిన శాస్త్రజ్ఞుడికి తమ్ముడుగా చేసి శేషేంద్ర ఈ నాటకంలో రక్త సంబంధాల కన్న వర్గసంబంధాలు, ప్రయోజనాల ప్రాధాన్యతలు మానవ సంబంధాలలో ఎంత బలీయంగా పనిచేస్తున్నాయో సూచించారు. ప్రజాస్వామ్యం కూడా ఈ నాటకంలో ఒక పాత్ర. రాజ్యంచేత, అధికార వర్గం చేత అది ఎప్పుడూ తిరస్కరించబడుతూనే వుంటుంది. తేలికపరచబడుతూనే వుంటుంది. అధికార వర్గ ప్రయోజనాలకు, నా అనే స్వార్థాన్ని సమర్థించి సంరక్షించటానికి ఏర్పడిన చట్టాలకు వాటి నగ్నత్వం, క్రూరత్వం ప్రజలకు కనబడకుండా చేసే ఒక రక్షణ కవచంగా మాత్రమే అది ఉపయోగపడుతున్న స్థితిని శేషేంద్ర గుర్తించి ఈ నాటకేతి వృత్తంలో భాగం చేశారు. ప్రజాస్వామ్యం అద్దాల బీరువాలో వుంచబడిన సువర్ణాక్షరాల బైండు పుస్తకం అని చెప్పిన శేషేంద్ర దేశీయ ప్రజాస్వామ్యం నోరులేని, నోరు మూసుకొని పడి వుండాల్సిన జీవి స్థాయికి దిగి జార్చబడటాన్ని ఈ నాటకం స్పష్టం చేసింది.
స్వాతంత్య్రం ఒక మేడిపండు అని తెలిసి దానిని సాంస్కృతిక రంగంలో తీవ్ర స్వరంతో నిరసిస్తున్న దిగంబర కవిత్వోద్యమానికి, రాజకీయార్థికరంగంలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరిస్తున్న నక్సల్బరి విప్లవోద్యమానికి వేగుచుక్కగా వచ్చిన నాటకంగా మబ్బుల్లో దర్బారుకు ఒక ప్రాధాన్యత వుంది. కవులు ప్రభుత్వాధికారుల పక్షాన చేరి వారి సన్మానాలకు అశపడుతూ వారిని ఇంద్రులుగా చంద్రులుగా పొగుడుతూ పబ్బం గడుపుకొంటున్న తీరును గురించిన శేషేంద్ర ఆగ్రహం కూడా ఈ నాటకంలో భాగమైంది. ఇక్కడే తరువాతి కాలంలో శేషేంద్ర బలంగా నమ్మి ప్రచారం చేసి వైజ్ఞానిక నాయకత్వం భావనకు ప్రాతిపదికలు వున్నాయి. వేదాంతి చేత మానవమహాచక్రవర్తికి 'కవులూ, కళాకారులేరా నీకు వెలుగుబాటులు; నీ పురోగమనానికి నిదర్శనాలు'-అన్నమాటలు గమనించదగినవి.
1927లో పుట్టిన శేషేంద్ర శర్మ తన ఇరవయ్యవ ఏళ్ళ వయసునాటికే కవిత్వం ప్రౌఢంగా చెప్పటాన్ని బాగా అభ్యాసం చేశారు. 1947 నుండి అప్పుడప్పుడు చెప్పిన పద్యాల కూర్పుగా 1961లో చంపూవినోదిని వెలువడటంతో శేషేంద్ర కవిగా తెలుగు సాహిత్యరంగ ప్రవేశం చేశారు. 1962లో 'ఋతుఘోష' కావ్యప్రచురణ చేసి కవిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నారు. అక్కడి నుండి ఆయన కవితాజైత్రయాత్ర సందడిగా సంవాదాలతో సంరంభంగా సాగింది. 'యుగద్రష్ట'గా ఆయనకొక పేరు తెచ్చిపెట్టింది. కవిగా శేషేంద్రను రెండుకోణాల నుండి చూడాలి. ప్రాథమికంగా కవిత్వమంటే శేషేంద్ర దృష్టిలో ఆశ్చర్యం కలిగించే చమత్కార అభివ్యక్తి. వాల్మీకి తదితరుల కవిత్వ విశేష గుణగణ గానం చేసేటప్పుడు కూడా శేషేంద్రం తరచూ దీనికే ప్రాధాన్యమిచ్చారు. అందువల్ల తను కూడా అహా అనిపించేలా కవిత్వం వ్రాయటం పైననే దృష్టి పెట్టిన కవి శేషేంద్ర. 'గజల్' ప్రక్రియ శేషేంద్రకు ఇష్టం కావటం కూడా ఈ జీవలక్షణం వల్లనే. కనుక శేషేంద్ర కవిత్వాన్ని అభివ్యక్తి రామణీయత దృష్ట్యా పరిశీలించటం, ఆహా పుట్టించేట్లు కవిత్వం చెప్పటానికి ఆయన ఉపయోగించుకొన్న సాహిత్య మూలకాలను గుర్తించటం ఒక పద్ధతి. సౌందర్యం, చమత్కారం చూపించటానికి కవి కృషి చెయ్యాలన్నది శేషేంద్ర పిలుపు. అయితే అలా చెప్పటానికి ఏదో ఒక భావం అవసరం అని శేషేంద్రకు తెలుసు. శేషేంద్ర ఏ భావాలను తన కవిత్వంలో పలికించాడో పరిశీలించటం మరొక కోణం. ఆనుషంగికంగానే అయినా కవి ఏ సామాజిక సంవేదనను ఏ మేరకు తన కవిత్వంలో ప్రతి ఫలించాడో పరిశీలించాలి.
కవిత్వరచనాభ్యాసకాలంలో శేషేంద్ర ప్రతి జీవిత సందర్భాన్ని కవితా వస్తువు చేసుకొన్నారు. అప్పుడప్పుడు చెప్పిన విడివిడి పద్యాలను అలాగే అచ్చు వేస్తే చాటువులు. వాటికి సందర్భాన్ని హాస్య వ్యంగ్య చమత్కార పద్ధతిలో వచనంలో ఇస్తూ వ్యాఖ్యానిస్తూ కూర్చారు కనుక 'చంపూ వినోదిని' అయింది ఆపుస్తకం. తాను వినోదంగా వ్రాశారు. చదివేవారికి వినోదం కలిగించటం ఉద్దేశించారు. ఇందులో స్త్రీలను ఉద్దేశించి స్త్రీలను వర్ణిస్తూ వ్రాసిన శృంగార ప్రధాన పద్యాలూ వున్నాయి. కాఫీ హొటలు పరిసరాలను వర్ణించే పద్యాలూ వున్నాయి. ఆశువుగా చెప్పిన సరదా పద్యాలున్నాయి. అధికార దుర్మదాంధులను విమర్శిస్తూ వ్రాసిన తిట్టూ కవిత్వమూ వుంది. చూడండి.
లక్షాతొంబయి కుంభకోణములు నిర్లక్ష్యంబుగా సల్పుచున్.
కుక్షిన్ నింపెడు కుంభకర్ణులును భూగోళంబు గోళంబుగా
భక్షింపంగల బ్రహ్మ రాక్షసులు శుంభద్గండ భేరుండముల్
పక్షీంద్రుల్ తమ జీర్ణ శక్తి కివిగో బాబూ నమస్కారముల్....
* * * *
ఓరోరీ! అధికార దుర్మద వితండోద్ధండ చండాలుడా
నీరాజత్వము నీనిరంకుశ దశన్ నీ గర్వ సర్వస్వమున్
నీరేఖాలవమేని నిల్పక నినున్ నిర్మూలముంజేసి ని
స్సారుంజేయు దినంబు వచ్చె నికపై చాలింపు నీవేషముల్.
ఆఫీసర్లదీ రాజకీయ నాయకులదీ ఒకే లక్షణం, ఒకే తత్త్వం, ఒకే దృక్పథమూ అని 1954 నాటికే స్పష్టంగా తెలుసు శేషేంద్రకు. ధనిక వర్గం వాళ్ళకు వెన్నెముకగా వుందని కూడా తెలుసు. వాళ్ళమీద తన ధర్మాగ్రహాన్ని కవి వ్యక్తం చేశారు కవిత్వం మాధ్యమంగా.
అప్రయోజకులైన యీ ప్రజానీకంబు
ఘనతర క్షీరసాగరము గాగ
ఎల్లదిక్కుల తాండవించు నజ్ఞానంబు
బలమైన మందరాచలముగాగ
జాజ్జ్వల్వమాన ప్రజాస్వామ్య సూత్రంబు
త్రాడైన భుజగాధిరాజు గాగ
మహిత కోపాటోప మదమత్సరంబులు
గగనమంటెడు తరంగములుగాగ
చటుల కలికాల రాక్షసజాతులైన
రాజకీయులునుద్యోగు లాజివోలె
ఉభయ పార్శంబులంజేరి యుగ్రధాటి
చిలుకు చున్నారలధికార సిద్ధి కొరకు -”
ఇలాంటి సామాజిక విమర్శనాత్మక పద్యాలు చంపూ వినోదినిలో వున్నాయి. ఇది చెప్పట మెందుకంటే శేషేంద్ర ప్రారంభ కవిత్వం సంప్రదాయ ప్రాబంధిక పద్య నిర్మాణ వారసత్వం నుండి రూపు తీసుకొన్నదనీ, విషయం, భాష రెండూ ఇందులో ప్రధానంగా వున్నాయని చెప్పటానికి. ఋతుఘోష దానికి కొనసాగింపు. పద్య రచన శ్రీనాథాధి పూర్వ కవుల ప్రభావంతో సాగటం, ఉత్పల సత్యనారాయణచార్యులు గారన్నట్లు పదాలతో పాఠకులను మోహింప చేయటం, ఇందులో ప్రధానం. విశ్వనాథసత్యనారాయణ గారు గుర్తించి చెప్పిన విశేషం - ఋతువులలో బాహ్యవిలాసం, మానవ మనోప్రవృత్తుల మీద వాటి ప్రభావం, మానవుల సామాజికార్థిక వైయక్తిక పరిస్థితులలోని ప్రత్యేకత మూలంగా ఆ ప్రభావాలలోని వైవిధ్యం, విషాదం ఈ కావ్యంలో ప్రతి ఫలించటం -ఏది ఏమైనా భావుకత ఇందులో కేంద్రాంశం. భావకవిత్వాన్ని ముప్ఫైఏళ్ళ తరువాత పునరుజ్జీవింప చేసే పనికి పూనుకొని వ్రాసిన కావ్యంగా ఇది కనిపిస్తుంది.
చిక్కని చిగురాకు జీబులో పవళించి
యెండువేణువు కంఠమెత్తిపాడె తలిరాకులూడిచి తపసిగా మసలిన
నగ్నవల్లికయు పర్ణములదాగె జిలుగు సీతాకోకచిలుకరూపము దాల్చి కీటకయోగి కంకేళి గవిసె
శిశిర వ్రతాచార జీర్ణమారుతమూర్తి యలరు గిన్నెల గంధమలదు కొనియె
ఇచ్ఛ ప్రకృతిలో రెక్కవిచ్చెనేమొ యెడద పురుషునిలో మొగ్గదొడిగెనేమొ విశ్వమందిర కుడ్యముల్ విరుగగొట్టి మోహకల్లోల వీచిక ముంచివ
